ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండ.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

  • ఆర్టీసీ సమ్మెలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి
  • రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
  • కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
  • వ్యక్తిగతంగా రూ. 5 లక్షల సాయం ప్రకటించిన నర్సంపేట ఎమ్మెల్యే
  • మృతదేహంతో కార్మికుల ఆందోళన.. ముత్తోజిపేటలో ఉద్రిక్త వాతావరణం
టీజీఎస్ఆర్టీసీ సమ్మెలో భాగంగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందిన‌ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఆయన మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ప్రభుత్వం, తక్షణమే స్పందించి పరిహార చర్యలు చేపట్టింది. ఈ మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి అధికారికంగా వివరాలు వెల్లడించారు.

ప్రభుత్వం తరఫున శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం (ఎక్స్‌గ్రేషియా) అందిస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు. దీంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబం కావడంతో వారికి ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన వ్యక్తిగత హోదాలో మరో రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీంతో శంకర్ గౌడ్ కుటుంబానికి మొత్తం రూ.15 లక్షల ఆర్థిక సాయం అందనుంది. ఆర్డీవో ఉమారాణి స్వయంగా శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

గత 25 ఏళ్లుగా ఆర్టీసీ డ్రైవర్‌గా సేవలందించిన శంకర్ గౌడ్‌కు భార్య హేమలత, కుమార్తె షామిలి, కుమారుడు హేమంత్ ఉన్నారు. ఆయన భార్య దివ్యాంగురాలు కావడం, సొంత ఇల్లు లేకపోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. 

ముత్తోజిపేటలో ఉద్రిక్తత
శంకర్ గౌడ్ అంత్యక్రియలను ఆయన కుమార్తె నివసిస్తున్న ముత్తోజిపేట గ్రామంలో నిర్వహించనున్నారు. ఆయన మరణంతో ముత్తోజిపేట గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన మృతదేహాన్ని నర్సంపేట బస్ డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించాలని ఆర్టీసీ కార్మికులు, నాయకులు పట్టుబట్టారు. ఈ ఆందోళనలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా పాల్గొని, మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించారు.

అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించగా, బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కార్మికుల నిరసనలతో ముత్తోజిపేటలో ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతోంది.

Telangana Govt
Ex Gratia
Tgsrtc Driver
Shankar Goud
TGSRTC
RTC Strike

More Telugu News